Andhra Pradesh: ఈ నెల 7 నుంచి 10 వరకు అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తాం: రఘువీరారెడ్డి
- ఫిబ్రవరి నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి
- అభ్యర్థులను నేరుగా రాహుల్ తో సంధానిస్తాం
- ఈ నెల 4 నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్ర
ఎన్నికల సన్నద్ధత నిమిత్తం మూడు రోజుల పాటు పీసీసీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని, ఈ సమావేశాల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 7 నుంచి 10 వరకు అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తామని, ఆ దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తామని వివరించారు. అభ్యర్థులను నేరుగా రాహుల్ గాంధీకి అనుసంధానమయ్యే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని వివరించి చెప్పారు.
ఈ నెల 4 నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహించనున్నట్టు రఘువీరా తెలిపారు. అభ్యర్థులకు ఈ యాత్ర బాధ్యతలతో పాటు ‘ఇంటింటా కాంగ్రెస్’ బాధ్యతలు కూడా అప్పగిస్తామని, ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు, నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహిస్తామని, 84 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర నిర్వహిస్తామని, మిగిలిన స్థానాల్లో తర్వాత చేస్తామని, ఈ యాత్రలో ప్రతిరోజు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నాయకులు వచ్చి పాల్గొంటారని పేర్కొన్నారు.