National Registrar of citizens: పౌరసత్వ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వం: మమతా బెనర్జీ
- ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందే
- ఎన్ ఆర్సీ బిల్లు పేరుతో ఈశాన్యం భగ్గుమంటోంది
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు
పౌరసత్వ బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలంటూ పశ్చిమబెంగాల్ లో ఈరోజు పర్యటించిన ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పౌరసత్వ బిల్లుకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లో హిందూ-ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను ముందుకు సాగనీయమని అన్నారు. ఎన్ ఆర్సీ బిల్లు పేరుతో ఈశాన్యం భగ్గుమంటోందని, అసోంలో బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తులను తరిమివేయడానికి బీజేపీ యత్నిస్తోందని దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, ఆ పార్టీకి బెంగాల్ లో పోటీ చేసే నేతలు లేరని విమర్శించారు. మోదీ హయాంకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని మమతా బెనర్జీ అన్నారు.