Bihar: బీహార్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురి మృతి..కొనసాగుతున్న సహాయక చర్యలు
- పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్
- 14 మందికి తీవ్ర గాయాలు
- బీహార్లోని వైశాలిలో ఘటన
బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జోగ్బానీ-ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఈ తెల్లవారుజామున 3.52 గంటలకు వైశాలిలో పట్టాలు తప్పింది. మొత్తం 9 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సీమాంచల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైందని, 9 బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్లలో మూడు స్లీపర్ కోచ్లు, ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, ఉన్నట్టు రైల్వే అధికార ప్రతినిధి రాజేశ్ కుమార్ తెలిపారు. సమీపంలోని పట్టణాల నుంచి వైద్యులను ఘటనా స్థలానికి పంపినట్టు పేర్కొన్నారు.