anna hajare: సమస్యలపై పోరాడే శక్తి నాకుంది: అన్నాహజారే
- నిరాహార దీక్షలు నాకు కొత్తకాదు
- నాకేదైనా అయితే ప్రధానే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది
- 'జన ఆందోళన్ సత్యాగహ్ర' పేరుతో హజారే నిరాహార దీక్ష
సమస్యలపై పోరాడే శక్తి తనకు ఉందని, ఉద్యమంలో భాగంగా తనకేమైనా జరిగితే ప్రధాన మంత్రి మోదీయే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే అన్నారు. లోక్పాల్ చట్టం అమలు జరిగేలా వెంటనే లోక్పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హజారే ‘జన ఆందోళన్ సత్యాగ్రహ్’ పేరుతో జనవరి 30వ తేదీ నుంచి తన స్వగ్రామం మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా 81 ఏళ్ల హజారే మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంతో ఉపయుక్తమైన లోక్పాల్ బిల్లును అమల్లోకి తేవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని హజారే ఆరోపించారు. రాష్ట్రంలో లోకాయుక్త యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. లోక్పాల్ అమల్లోకి వస్తే ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా విచారణ నుంచి తప్పించుకోలేరన్నారు. తగిన ఆధారాలుంటే ఎలాంటి వారైనా చట్టం పరిధిలోకి వస్తారని, దీనివల్ల అవినీతి అంటే భయపడే పరిస్థితి వస్తుందని అన్నారు.