team india: ఈ స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారికి.. కఠినమైన పరిస్థితుల్లోనే అవకాశాలు వస్తాయి: అంబటి రాయుడు
- అత్యున్నత అటాకింగ్ బౌలింగ్ ఉన్న జట్టును ఎదుర్కోవడం చాలా కఠినం
- 30 ఓవర్ల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాం
- గెలుపులో మన బౌలర్ల కృషి చాలా గొప్పది
న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 35 పరుగులతో విజయం సాధించింది. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ కు దిగిన అంబటి రాయుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 90 పరుగులు సాధించి... భారత్ గౌరవప్రదమైన 252 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రాయుడు మాట్లాడుతూ, అత్యున్నతమైన అటాకింగ్ బౌలింగ్ ఉన్న జట్టును ఎదుర్కోవడం చాలా కఠినమని చెప్పాడు. ప్రారంభంలోనే వికెట్లు పడిపోయన నేపథ్యంలో, 30 ఓవర్ల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడాలని అనుకున్నామని తెలిపాడు. తాను, విజయ్, జాధవ్ లు అనుకున్న విధంగానే క్రీజులో నిలదొక్కుకున్నామని చెప్పాడు.
4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసే వారికి కఠినమైన పరిస్థితుల్లోనే సత్తాను నిరూపించుకునే అవకాశాలు వస్తాయని తెలిపాడు. ఈ స్థానాల్లో ఆడే బ్యాట్స్ మెన్లు ఈ సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఈ గెలుపులో భారత బౌలర్ల కృషి చాలా గొప్పదని కితాబిచ్చాడు.