bjp: అమిత్ షాను ఘాటుగా ప్రశ్నిస్తూ కళావెంకట్రావు బహిరంగ లేఖ

  • అవకాశవాదమే అజెండాగా బీజేపీ పనిచేస్తోంది
  • అవినీతిపరులను బీజేపీ ప్రోత్సహిస్తోంది
  • బీజేపీ-వైసీపీలది కుట్ర కూటమి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక నేరస్థులను, అవినీతి పరులను బీజేపీ ప్రోత్సహిస్తోందని, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా, అవకాశవాదమే అజెండాగా ఆ పార్టీ పని చేస్తోందని ఆ లేఖలో ఘాటుగా ఆరోపించారు. కక్ష సాధింపు చర్యేలు పరమావధిగా పెట్టుకున్న బీజేపీ, అవినీతిపరులను ప్రోత్సహిస్తోందని, బీజేపీ-వైసీపీలది కుట్ర కూటమి, కక్షసాధింపు కూటమి, అవినీతి కూటమి అని విమర్శించారు. నినాదాలకు ఇచ్చే ప్రాధాన్యతను వాటి అమలుకు ఆ పార్టీ ఇవ్వడం లేదని అన్నారు.

విభజన చట్టం హామీల ప్రస్తావనే లేకుండా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి అవమానించారని, మహారాష్ట్రకు రూ.4,741 కోట్ల కరవు సాయం అందించిన కేంద్రం, ఏపీకి మాత్రం రూ.900 కోట్లే ప్రకటించడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ డిక్లరేషన్ ద్వారా ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడమే బీజేపీ విధానమా? ఎన్డీఏ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగానే దాని నుంచి మిత్రపక్షాలు వైదొలిగాయని, 16 మిత్రపక్షాలు వైదొలగడంపై ఏం సమాధానం చెబుతారు? అని ఆ లేఖలో కళావెంకట్రావు ప్రశ్నించారు.

కాగా, ఏపీకి మోదీ, అమిత్ షాలు మోసం చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రేపు ఏపీలో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ తరుణంలో అమిత్ షాను విమర్శిస్తూ కళా వెంకట్రావు లేఖ రాయడం గమనార్హం.

  • Loading...

More Telugu News