Jammu And Kashmir: కశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం!: మోదీ
- జమ్మూకశ్మీర్ లో పర్యటించిన మోదీ
- ఎయిమ్స్ కు, యూనివర్శిటీ ఆఫ్ లడక్ కు పునాది
- అవినీతి రాజకీయాలను దేశం నుంచి తరిమి కొట్టాం
వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని, మళ్లీ తానే ప్రధానిని అవుతానని నరేంద్ర మోదీ ధీమాగా అన్నారు. జమ్మూకశ్మీర్ లో ఈరోజు ఆయన పర్యటించారు. జమ్మూ ప్రాంతంలోని లేహ్, విజయ్ పురాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎయిమ్స్ కు, యూనివర్శిటీ ఆఫ్ లడక్ కు ఆయన పునాదిరాళ్లు వేశారు.
విజయ్ పురాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను శంకుస్థాపన చేశానని, వాటి ప్రారంభోత్సవాలకు తానే వస్తానని, మళ్లీ తానే ప్రధానిని అవుతానన్న ధీమా వ్యక్తం చేశారు. తమ పాలనలో అవినీతి రాజకీయాలను దేశం నుంచి తరిమి కొట్టామని అన్నారు.
ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్తవ్యబద్ధతతో కశ్మీరీ పండిట్ల ఆత్మాభిమానం, గౌరవం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. హింస, ఉగ్రవాదం చెలరేగిన కాలంలో కశ్మీరీ పండిట్లు తమ సొంత ఇళ్లను వదిలి బయటకు పారిపోవాల్సి వచ్చిందని చెబుతూ, దీనిని దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు.