numayish: నాంపల్లి ఎగ్జిబిషన్ పై అగ్నిప్రమాదం ప్రభావం.. తగ్గిన ఆదరణ!
- గణనీయంగా తగ్గిన సందర్శకులు
- గత నెల 30న ప్రమాదంలో 300 స్టాళ్లు అగ్నికి ఆహుతి
- ఈనెల 15వ తేదీన ముగియనున్న ఎగ్జిబిషన్
భారీ అగ్నిప్రమాదం అనంతరం పునఃప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్ పట్ల సందర్శకుల్లో ఆసక్తి తగ్గినట్టు కనిపిస్తోంది. సందర్శకుల సంఖ్య అంతంతగానే ఉంది. నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. గతనెల 30వ తేదీన జరిగిన ప్రమాదంలో 300 స్టాళ్లు అగ్నికి ఆహుతికాగా, కోట్ల మేర ఆస్తినష్టం జరిగింది.
ఇక అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టి కాలిపోయిన స్టాళ్లను తొలగించి పునరుద్ధరించడంతో ఈనెల 2వ తేదీన ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభమైంది. అయితే తొలిరోజు కేవలం 16 వేల మంది మాత్రమే ఎగ్జిబిషన్‌ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలవు రోజు ఆదివారం సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావించారు. కనీసం లక్ష మంది వస్తారని ఆశిస్తే సంఖ్య 35 వేలను మించలేదు.
ఎగ్జిబిషన్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నగరవాసులను భయాందోళనలకు గురిచేయడం వల్లే, సందర్శకులు ఎక్కువగా రావడం లేదని భావిస్తున్నారు. పరిస్థితిని గమనించిన నిర్వాహకులు సందర్శకులు నిర్భయంగా రావచ్చునని, భద్రతాపరంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆదివారం నాటికి పరిస్థితి మెరుగపడలేదు. మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.