Mamata Banerjee: 13 ఏళ్ల తర్వాత మళ్లీ దీక్షకు దిగిన మమత.. అప్పట్లో 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష!
- అప్పట్లో వామపక్ష ప్రభుత్వ విధానాలపై ధర్నా
- తాజాగా కేంద్రం తీరుపై మండిపడుతూ ధర్నా
- రాత్రంతా జాగారం.. ఆహారం తీసుకునేందుకు నిరాకరణ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 13 ఏళ్ల తర్వాత దీక్షకు దిగారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి ‘సత్యాగ్రహ’ ధర్నా చేపట్టారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత రాత్రికి రాత్రే దీక్షకు దిగారు. రాతంత్రా మెలకువగానే ఉన్న ‘దీదీ’ ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను దీక్షకు కూర్చున్న చోటే శాసనసభ కార్యకలాపాలు కూడా కొనసాగుతాయని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ 13 ఏళ్ల క్రితం అప్పటి వామపక్ష ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. ఏకంగా 26 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె దీక్షకు కూర్చున్నారు. మరోవైపు కేంద్రం చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు సిద్ధమయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, దేవెగౌడ, ఎంకే స్టాలిన్, తేజస్వీయాదవ్, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఇప్పటికే మమతకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మమతతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది.