Chandrababu: అమిత్ షా వ్యాఖ్యలకు ఘాటుగా చంద్రబాబు కౌంటర్
- నాలుగేళ్ల క్రితం మీరెక్కడున్నారు?
- గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి
- అవినీతి పార్టీ గెలిస్తే తమకు అండగా ఉంటుందని షా భావిస్తున్నారు
ఎన్టీయేలోకి రాకుండా చంద్రబాబుకు తలుపులు మూసేశామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 2014లో ఎవరు ఎక్కడున్నారో గుర్తు చేసుకుంటే మంచిదని అమిత్ షాకు సూచించారు. నాలుగేళ్ల క్రితం ఆయన ఎక్కడున్నారు? ఆయన చరిత్ర ఏంటి? అని ప్రశ్నించారు. మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయని, సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొన్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలని హితవు పలికారు.
షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ప్రజలు నిలదీస్తుంటే దాని గురించి మాట్లాడకుండా అది చేశాం, ఇది చేశామంటూ దాడిచేస్తే ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో అవినీతి పార్టీ గెలిస్తే తమకు అండగా ఉంటుందని షా అనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.