Karnataka: మాది మోదీలా ప్రజలను ప్రలోభ పెట్టే బడ్జెట్ కాదు: కర్ణాటక సీఎం
- నా బడ్జెట్‌లో ప్రలోభాలు ఉండవు
- ఆపరేషన్ లోటస్‌కు నేను అడ్డుపడను
- మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి
ఈ నెల ఎనిమిదో తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. తమ బడ్జెట్‌లో ఎటువంటి ప్రలోభాలు ఉండవని, కేంద్ర బడ్జెట్‌లా మాయాజాలం చేయబోనని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ లోటస్’ను బీజేపీ నేతలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, వారికి తన నుంచి ఎటువంటి అడ్డంకి ఉండబోదన్నారు. ఎవరి ఇష్టం ప్రకారం వారు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి దేశ ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారన్న కుమారస్వామి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు రానివ్వబోనన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తానన్న మోదీ సాధించింది శూన్యమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల ఆశ చూపి కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోందని కుమారస్వామి ప్రశ్నించారు.