Narendra Modi: బెంగాల్ ఘటనపై పెదవి విప్పని టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే.. జాతీయ మీడియాలో విస్తృత కథనాలు
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగాల్ పరిణామాలు
- నోరు విప్పని కేసీఆర్, నవీన్ పట్నాయక్, పళనిస్వామి
- బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగమేనంటూ కథనాలు
పశ్చిమ బెంగాల్‌లో మోదీ వర్సెస్ దీదీలా మారిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలన్నీ ఈ ఘటనపై స్పందిస్తుండగా తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్, ఒడిశాలోని బీజేడీ, తమిళనాడులోని అన్నాడీఎంకేలు పెదవి విప్పకపోవడంపై జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి.
మమత బెనర్జీ ధర్నాపై ఈ మూడు పార్టీలు పెదవి విప్పకపోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని, ఎన్నికల అనంతర రాజకీయానికి ఇది సంకేతమని అంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందులో భాగంగా తొలుత కలిసింది మమతనేనని, కానీ ఇప్పుడామె బీజేపీపై పోరాడుతుంటే కేసీఆర్ మౌనం దాల్చారని పేర్కొన్నాయి.
మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ముఖం చాటేశారు. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే ఆయన ఈ వివాదంపై స్పందించలేదని పేర్కొన్నాయి. తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే మమతకు సంఘీభావం ప్రకటించడం వల్లే అన్నాడీఎంకే ఈ వివాదానికి దూరంగా ఉన్నట్టు జాతీయ మీడియా తమ కథనాల్లో పేర్కొంది.