Chigurupati Jayaram: మలుపులు తిరిగి.. తిరిగి.. కొలిక్కి వచ్చిన చిగురుపాటి జయరామ్ హత్యోదంతం!
- చిగురుపాటి జయరామ్ హత్య కేసులో దాదాపు ముగిసిన విచారణ
- ఎన్నో మలుపులు, మరెన్నో నమ్మలేని నిజాలు
- హత్య చేసింది రాకేష్ రెడ్డేనని తేల్చిన పోలీసులు
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో విచారణ దాదాపు ముగిసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, అన్ని కోణాల నుంచి దర్యాఫ్తు చేసి, విచారణను ఓ కొలిక్కి తెచ్చారు. ఎన్నో మలుపులు, మరెన్నో నమ్మలేని నిజాలు ఈ కేసు వెనుక దాగున్నాయని పోలీసులే స్వయంగా అంటున్నారు. విశ్వసనీయ పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, శిఖా చౌదరి మాజీ ప్రియుడు రాకేశ్ రెడ్డే జయరామ్ ను హత్య చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అతనే.
ఈ హత్యకు దారితీసిన పరిణామాల్లోకి వెళితే, జయరామ్ కోస్టల్ బ్యాంకుకు డైరెక్టర్ గా ఉంటూ, ఎక్స్ ప్రెస్ టీవీ చానల్ ను పెట్టారు. ఆయన అక్క కుమార్తె శిఖా చౌదరిని ఎండీగా నియమించారు. వారిద్దరికీ, అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ బంధం నడుస్తున్న సమయంలోనే శిఖా చౌదరి, రాకేశ్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే, కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా విభేదాలు ఏర్పడ్డాయి.
జయరామ్‌కు మెదక్ ప్రాంతంలో టెక్ట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ నష్టాల్లో ఉన్న వేళ, ఉద్యోగులు వేతనాల కోసం రాకేశ్ వద్ద జయరామ్, రూ. 4.50 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ సమయంలోనే రాకేశ్ కు, శిఖా చౌదరికి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమ బంధంగా మారింది. శిఖా కోసం రాకేష్ లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో ఆపై విదేశాలకు వెళ్లిన జయరామ్, ఇటీవలే తిరిగి వచ్చాడు. శిఖాను వదిలేయాలని రాకేశ్ ను కోరగా, తన నుంచి తీసుకున్న డబ్బు, ఆమెకు ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వాలని రాకేశ్ డిమాండ్ చేయగా, జయరామ్ అంగీకరించారు. ఆ తరువాత డబ్బులు తిరిగి ఇచ్చేందుకు జయరామ్ ఆసక్తి చూపలేదు.
దీంతో కోపం పెంచుకున్న రాకేశ్, ఓ అందమైన అమ్మాయి డీపీ పెట్టి, వాట్స్ యాప్ ఖాతా తెరిచి, జయరామ్ పై వలేశాడు. అతన్ని మభ్యపెట్టి, సెక్యూరిటీ, డ్రైవర్ లేకుండా, ఒంటరిగా తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ ఘటన జనవరి 31న జరిగింది. తన ఇంటికి వచ్చిన జయరామ్ ను నిర్బంధించి, డబ్బుకోసం ఒత్తిడి తేగా, కోస్టల్ బ్యాంక్ లో గతంలో పనిచేసిన ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు తెప్పించాడు. రూ. 5.5 కోట్లు ఇవ్వాల్సి వుంటే, రూ. 6 లక్షలు ఇవ్వడమేంటన్న కోపంతో రాకేశ్ రెడ్డి, జయరామ్ పై పిడిగుద్దులు గుద్దాడు.
హార్ట్ పేషెంట్ అయిన జయరామ్, ఆ దెబ్బలకే చనిపోగా, ఏం చేయాలో తెలియని రాకేశ్, సాయంత్రం వరకూ మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకుని, ఆపై నందిగామ సమీపంలోని ఐతవరానికి తీసుకెళ్లాడు. వెనుక సీటులో ఉన్న జయరామ్ ను స్టీరింగ్ ముందు కూర్చోపెట్టాలన్న ఆయన ప్రయత్నం సాగలేదు. దీంతో అతని చేతిలో బీరు సీసా ఉంచి, మరో సీసాను రోడ్డుపై పడేసి, ఆపై బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేశాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ కు గతంలో నేర చరిత్ర ఉండటం, కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరిట రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం, ఓ హీరోయిన్ తో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడినట్టు తెలుస్తుండటంతో, అతని నేర చరిత్రపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అనేక మోసాలు, దందాలతో పాటు, తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ కేసులో జయరామ్ పై విషప్రయోగం జరిగినట్టు అనుమానాలు ఉన్నాయని, పోస్టుమార్టం రిపోర్టు అనంతరం అసలు విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.