East Godavari District: అంకంపాలెంలో కొబ్బరి చెట్టెక్కిన చిరుత.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
- పులి దాడిలో నలుగురికి గాయాలు
- చెట్టెక్కిన పులిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
- పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు
చెట్టెక్కిన చిరుత గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. చిరుతను బంధించేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారుల నుంచి కూడా అది తప్పించుకోవడంతో భయంతో వణికిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపించడంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీసి విషయం చెప్పాడు. అందరూ కలిసి కర్రలు పట్టుకుని పులి కనిపించిన చోటికి చేరుకున్నారు. వారిపై దాడిచేసిన పులి నలుగురిని గాయపర్చింది. దీంతో అప్రమత్తమైన ప్రజలు కర్రలతో దానిపై దాడికి దిగారు.
భయపడిన పులి మామడి చెట్టు ఎక్కి దానిపై నుంచి కొబ్బరి చెట్టు ఎక్కేసి పైకి చేరుకుంది. దీంతో ఏమీ చేయలేని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులిని బంధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారి నుంచి తప్పించుకున్న పులి పొలాల్లోకి పరుగులు తీసింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.