rohini: నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది: నటి రోహిణి
- అమ్మ వుంటే బాగుండేది
- మా అందరి సంతోషం చూసేది
- గొప్ప గొప్ప వాళ్లతో చేశాను
బాలనటిగా అప్పట్లో అగ్రకథానాయకుల సినిమాల్లో రోహిణి నటించారు .. ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి రోహిణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన తల్లిని గురించి ప్రస్తావించారు. "నా అయిదో యేట మా అమ్మ చనిపోయింది. ఆడపిల్ల కావాలి .. ఆడపిల్ల కావాలి అని ఎంతో ఆశపడి మా అమ్మ నన్ను కన్నదట. అలాంటి అమ్మ నాకు ఊహ తెలిసే సమయానికి చనిపోవడం బాధ కలిగిస్తూ ఉంటుంది.
అమ్మ వుంటే ఎంతో బాగుండును కదా అని ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది. అమ్మ వుంటే బాగా చూసుకునే వాళ్లం కదా అనిపిస్తుంది. మా అందరినీ ఇలా చూస్తూ ఆమె ఎంతో సంతోషించేది కదా అనిపిస్తూ ఉంటుంది" అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. "ఇక ఇన్నేళ్ల నా కెరియర్లో గొప్ప గొప్ప నటీనటులతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఆ సినిమాలు చూస్తుంటే .. అప్పుడు వాళ్లతో కలిసి అలా చేసింది నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.