mamata bajerjee: ఒక్క పోలీసు అధికారి కోసం మమత ధర్నా చేయడం లేదు.. దీని వెనుక చాలా ఉంది: అమెరికా నుంచి జైట్లీ ట్వీట్
- సీబీఐ వ్యవహారంలో మమత అతిగా స్పందించడం అనుమానాలకు తావిస్తోంది
- తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడమే మమత లక్ష్యం
- అవినీతి పాలకులంతా ఏకమై దేశ పగ్గాలను చేపట్టాలని చూస్తున్నారు
సీబీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేపట్టిన దీక్షపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. అమెరికాలో చికిత్స పొందుతున్న జైట్లీ... అక్కడి నుంచే ట్విట్టర్ ద్వారా స్పందించారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ ను ప్రశ్నించేందుకు సీబీఐ వెళ్లిన వ్యవహారంపై మమత అతిగా స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.
కేవలం ఒక పోలీసు అధికారి కోసం మమత ధర్నా చేపట్టారనుకోవడం పొరపాటే అవుతుందని అన్నారు. దీని వెనుక ఉన్న వ్యూహమేమిటని ప్రశ్నించారు. ధర్నాకు ఇతర విపక్ష నేతలను ఆహ్వానించడం వెనకున్న అర్థమేమిటని అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను వెనక్కి నెట్టి... రానున్న ఎన్నికల్లో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడం కోసమే ఆమె ధర్నా చేస్తున్నారని చెప్పారు.
మమత దీక్షకు చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారని.. వీరిలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నవారేనని జైట్లీ అన్నారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశ పగ్గాలను చేపట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని ఇలాంటి సంకీర్ణాలు దేశానికి విపత్తును కలిగిస్తాయని అన్నారు.