YSRCP: జగన్ చాలా తప్పుడు సలహా తీసుకున్నారనిపించింది!: తమ్మారెడ్డి భరద్వాజ
- ఉండవల్లి ఇటీవల అన్ని పార్టీలను ఆహ్వానించారు
- బీజేపీ నుంచి కూడా హాజరయ్యారు
- జగన్ వెళ్లలేదు.. టీడీపీ వాళ్లుంటే రాననడం కరెక్టు కాదు
ఏపీ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని పార్టీలను ఇటీవల ఆహ్వానించారని అన్నారు. టీడీపీ వాళ్లు ఉంటే తాము వచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ ఓ లేఖ రాసిన అంశాన్ని, మిగిలిన వాళ్లందరూ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు.
టీడీపీ వాళ్లుంటే తాను రానని జగన్మోహన్ రెడ్డి అనడం ఎంత వరకు కరెక్టో తనకు అర్థం కాలేదని అన్నారు. రాష్ట్ర సమస్య గురించి మాట్లాడేందుకు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని పార్టీల వాళ్లను ఆహ్వానించారని, బీజేపీ తరపున కూడా హాజరయ్యారని చెప్పారు. ఇంతమంది హాజరైనప్పుడు జగన్ రావడానికేమైంది? ఆయన వెళ్లి ఉండాల్సిందని.. వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేశారని విమర్శించారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు జగన్ తన అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, పైగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని కొందరు, గెలవరని మరికొందరు అంటున్న పార్టీ, ఏదేమైనా, ఇలాంటి అవకాశమొచ్చినప్పుడు ఉపయోగించుకోవడం మంచిదని సూచించారు. జగన్ కు ఎవరు సలహాలిస్తున్నారో తనకు తెలియదు గానీ, చాలా తప్పుడు సలహా తీసుకున్నారని తనకు అనిపించిందని అన్నారు.