chigurupati: జయరాంను పక్కా పథకం ప్రకారమే హత్య చేశారు: కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి
- నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్టు చేశాం
- జయరాం ముఖంపై రాకేశ్ రెడ్డి బలంగా దాడి చేశాడు
- అక్కడున్న సోఫాపై ఆయన పడిపోయారు
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి పేర్కొన్నారు. నందిగామలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో ఇద్దరు నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఓ మహిళ పేరుతో సిమ్ తీసుకుని జయరాంతో రాకేశ్ చాటింగ్ చేశారని, జయరాంని గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి రాకేశ్ రెడ్డి రప్పించుకున్నాడని, తన వద్ద తీసుకున్న రూ.6 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడని తమ విచారణలో తెలిసిందని చెప్పారు. తన ఇంటికి రాగానే జయరాంని బంధించి డబ్బుల కోసం రాకేశ్ వేధించాడని అన్నారు. తన డబ్బుల కోసం జయరాం చేత స్నేహితులకు ఫోన్ చేయించాడని, కేవలం రూ.6 లక్షలు మాత్రమే జయరాం తన స్నేహితుల నుంచి తెప్పించగలిగాడని పేర్కొన్నారు.
గత నెల 31వ తేదీ ఉదయం 11 గంటల వరకు డబ్బుకోసం వేచి చూశారని, డబ్బులు తేకపోవడంతో జయరాంపై రాకేశ్ రెడ్డి దాడి చేసినట్టు చెప్పారు. జయరాం ముఖంపై రాకేశ్ రెడ్డి బలంగా కొట్టాడని, దీంతో, అక్కడున్న సోఫాపై ఆయన పడిపోయారని, ఆ సోఫాకు జయరాం ముఖం అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వివరించారు. హత్య తర్వాత రాకేశ్ రెడ్డి ఇద్దరు పోలీసు అధికారులకు ఫోన్ చేశాడని, హైదరాబాద్ నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి ఈ ఫోన్ కాల్స్ చేసినట్టు తమ విచారణలో తెలిసిందని అన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, వారి పాత్ర ఎంత ఉందో తెలుసుకుని వారిపైనా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై వారి నుంచి రాకేశ్ రెడ్డి సలహా తీసుకున్నాడని, ఈ హత్య కేసును నందిగామ వద్ద రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారని చెప్పారు. ఇది కుదరకపోవడంతో కారును, మృతదేహాన్ని అక్కడే వదిలేశారని, రాకేశ్ రెడ్డి బస్సులో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడని, ఈ కేసులో రాకేశ్ రెడ్డికి వాచ్ మెన్ శ్రీనివాస్ సహకరించినట్టు వివరించారు.
హైదాబాద్ లో సెటిల్ మెంట్లు, స్థిరాస్తి వ్యాపారం రాకేశ్ రెడ్డి చేసేవాడని, ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేసి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో తేల్చాల్సి ఉందని, ఈ కేసుతో ఎవరికి సంబంధం ఉన్నా వదిలిపెట్టమని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. జయరాం భార్య పద్మశ్రీ వాంగ్మూలం కూడా తీసుకున్నామని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.