Tata Nano: జనవరిలో ఒక్కటి కూడా అమ్ముడుపోని టాటా నానో!
- 2008లో మార్కెట్లోకి వచ్చిన నానో
- గత సంవత్సరం జనవరిలో 62 యూనిట్ల అమ్మకాలు
- త్వరలో పూర్తిగా ఆగిపోనున్న నానో తయారీ
గడచిన జనవరి నెలలో టాటా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన చిన్న కారు నానో అమ్మకాలు ఒక్కటి కూడా నమోదుకాలేదు. ఇదే సమయంలో ఒక్క కారు కూడా ప్లాంటులో తయారు కాలేదు. దీంతో నానో అమ్మకాలను పూర్తిగా నిలిపివేయనున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి కేవలం బీఎస్-6 కాలుష్య నియంత్రణా ప్రమాణాలకు అనుగుణంగా తయారైన కార్లను మాత్రమే విక్రయించాల్సివుండగా, ఈ ప్రమాణాలకు అనుగుణంగా నానోను ఆధునికీకరించే ఆలోచన లేదని సంస్థ ప్రకటించింది.
2018 జనవరిలో కేవలం 83 నానో కార్లు తయారు కాగా, 62 నానోలు అమ్ముడయ్యాయి. ఇక ఈ సంవత్సరం ఒక్క కారు కూడా అమ్ముడుకాలేదు, ఎగుమతి కాలేదు. ఇదే విషయమై స్పందించిన సంస్థ ప్రతినిధి ఒకరు, ఇప్పుడున్న నానో నూతన భద్రతా, కాలుష్య ప్రమాణాలను చేరలేదని, కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, 2008లో నానో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దిగువ, ఎగువ మధ్యతరగతి వర్గాలను టార్గెట్ చేసుకుని నానోను తయారుచేయగా, ఆశించిన ఆదరణకు మాత్రం నోచుకోలేదు.