Andhra Pradesh: చిగురుపాటి జయరాం హత్య.. కేసును తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ పోలీసుల అంగీకారం!
- హైదరాబాద్ లో జయరాం హత్య
- నిందితులు నందిగామ కోర్టు ముందు హాజరు
- ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించిన కోర్టు
ప్రముఖ వ్యాపారవేత్త చిరుగుపాటి జయరాం హత్య కేసులో నిందితులను తప్పించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య పద్మశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆమె హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య తెలంగాణలోని హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి ఈ కేసును అక్కడికే బదిలీ చేయాలని నిర్ణయించారు.
మరోవైపు ఈ కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను నందిగామ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం వారిద్దరికీ ఈ నెల 20 వరకూ రిమాండ్ విధించింది. కాగా, జయరాం హత్య కేసులో వీరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును కోరే అవకాశముంది.