ap legislative council: ఏపీ శాసన మండలి చైర్మన్ ఎన్నిక రేపు: నోటిఫికేషన్ జారీ
- నామినేషన్లకు ఈ రోజు సాయంత్రం గడువు
- టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ ఇప్పటికే ఖరారు
- ఎన్నిక ప్రక్రియ లాంఛనమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి నూతన చైర్మన్ ఎన్నిక గురువారం జరగనుంది. ఈ మేరకు శాసన మండలి ఇన్‌చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల వరకు ఈ పదవిలో ఉన్న ఎన్.ఎం.డి.ఫరూఖ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకుని మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖను కట్టబెట్టిన విషయం తెలిసిందే.
దీంతో ఖాళీ అయిన ఈ స్థానంలో చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌ను ఎంపిక చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక లాంఛనాన్ని పూర్తి చేయాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా నామినేషన్లకు గడువు విధించారు. గురువారం నామినేషన్ల పరిశీలన, తదనంతరం ఎన్నిక ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ అవకాశం లేనందున షరీఫ్ ఎన్నిక లాంఛనమే అని చెప్పొచ్చు.