Andhra Pradesh: ఆమంచి కృష్ణమోహన్ కు చంద్రబాబు, లోకేశ్ ఫోన్.. వైసీపీలో చేరికపై వెనక్కు తగ్గిన టీడీపీ నేత!
- ఈరోజు జగన్ తో భేటీ వాయిదా
- అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశం
- రాయబారం నడిపిన మంత్రి శిద్ధా రాఘవరావు
చీరాల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికకు బ్రేక్ పడింది. తన స్వగ్రామం పందిళ్లపల్లిలో నిన్న అనుచరులతో భేటీ అయిన ఆమంచి.. రాజకీయ భవిష్యత్ పై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన మంత్రి శిద్ధా రాఘవరావు ఆమంచితో చర్చలు జరిపారు. టీడీపీలో ఎదురవుతున్న ఇబ్బందులపై పార్టీ చీఫ్ చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో ఫోన్ లో మాట్లాడించారు.
చంద్రబాబు, లోకేశ్ సముదాయించడంతో మెత్తబడ్డ ఆమంచి ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్ తో జరగాల్సిన భేటీని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తనను కలుసుకోవాలని చంద్రబాబు ఆమంచి కృష్ణమోహన్ కు సూచించారు. దీంతో చీరాల నుంచి ఆయన అమరావతికి బయలుదేరారు. ఈ నెల 13న ప్రకాశం జిల్లాలో జగన్ ‘సమర శంఖారావం’ సభ సందర్భంగా ఆమంచి వైసీపీలో చేరుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.