Andhra Pradesh: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం.. కానీ ఏపీ ప్రభుత్వమే సమాచారం ఇవ్వలేదు!: విష్ణుకుమార్ రాజు ఆరోపణ
- అన్నింటిలో రాజకీయం చేస్తున్నారు
- ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ నేత
- రేపు రైల్వే కేంద్రానికి కూడా శంకుస్థాపన చేస్తారని సెటైర్
కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పడాన్ని బీజేపీ శానస సభా పక్షనేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇవ్వాల్సిన కనీస సమాచారాన్ని అందించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు విష్ణుకుమార్ రాజు మాట్లాడారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక కోసం మెకాన్ సంస్థను కేంద్రం నియమించిందనీ, టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. సొంతంగా రైళ్లను కూడా తయారుచేసి, హెడ్ క్వార్టర్స్ గా విశాఖను ప్రకటిస్తూ చంద్రబాబు రేపు శంకుస్థాపన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని విషయాల్లోనూ టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.