prashant bhushan: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కార నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
- సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావును నియమించడంపై ప్రశాంత్ భూషణ్ విమర్శలు
- సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్ర ప్రభుత్వం
- కోర్టు ఆదేశాలను విమర్శించడం.. న్యాయ వ్యవస్థలో తలదూర్చడమవుతుందన్న సుప్రీం
ప్రముఖ న్యాయవాది, యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కార నోటీసులను సుప్రీంకోర్టు పంపింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం.నాగేశ్వరరావును నియమించడంపై ట్విట్టర్ ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... సుప్రీంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. మూడు వారాల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు జరిగిన అంశాలపై లాయర్లు కానీ, ఇతరులు కానీ బహిరంగంగా విమర్శలు గుప్పించడం... ప్రజలపై ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను విమర్శించడం... న్యాయవ్యవస్థలో తలదూర్చడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో వాదనలను వింటామని తెలిపింది. మార్చి 7వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.