hardhik patel: గత లోక్ సభ ఎన్నికల్లో మిస్ అయ్యా.. ఈసారి బరిలోకి దిగుతున్నా: హార్దిక్ పటేల్
- గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాధ్యం కాలేదు
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయసు సరిపోలేదన్న హార్దిక్
- హార్దిక్ పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టకూడదనుకుంటున్న కాంగ్రెస్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నానని గుజరాత్ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. లక్నోలో ఈరోజు జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. 2014లోనే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, సాధ్యపడలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వయసు సరిపోలేదని తెలిపారు.
మరోవైపు, గుజరాత్ లోని అమ్రేలి ప్రాంతం నుంచి హార్దిక్ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఆయనపై తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా హార్దిక్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యతార్యాలీకి కూడా హార్దిక్ హాజరయ్యారు. ఈ ర్యాలీలో తొలి ప్రసంగం చేసింది హార్దిక్ పటేలే.