Chandrababu: తెలంగాణ ఉద్యోగులకు తక్కువ కాకుండా అన్నీ చేస్తా... సహకరించాలని ఉద్యోగులను కోరిన చంద్రబాబు!
- అసెంబ్లీ ఎన్నికలకు ముందే శుభవార్త
- తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్ మెంట్
- ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు
త్వరలో రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందుగానే ఉద్యోగులకు మంచి శుభవార్త చెబుతానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు తనకు తెలుసునని, అవకాశం ఉన్న మేరకు అన్నింటినీ తీరుస్తానని తెలిపారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ హాల్లో, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు ఆత్మీయ వీడ్కోలు సభ జరుగగా, ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు.
తెలంగాణ ఉద్యోగులకు ఏమాత్రం తక్కువ కాకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తానని చెప్పారు. విభజన తరువాత వారితో సమానంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, సుపరిపాలనకు ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదని, కేంద్రం సహకరిస్తే, ఉద్యోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు దగ్గర చేసేవాడినని అన్నారు. ఉద్యోగుల కృషి వల్లే ఆర్థికవృద్ధిలో ఏపీ ముందుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.