Britain: తల్లికి గాయమైందని తెలిసి 320 కిలోమీటర్ల ప్రయాణం... అంబులెన్స్ కన్నా ముందే వచ్చేశాడు!

  • బ్రిటన్ లో ఘటన
  • బస్సులు, రైళ్లు మారి గాభరాగా వచ్చిన కుమారుడు
  • అప్పటికింకా చేరుకోని అంబులెన్స్
  • క్షమాపణలు చెప్పిన అంబులెన్స్ నిర్వాహకులు

ఇదో ఆసక్తికరమైన ఘటన. తన తల్లి గాయపడిందని తెలుసుకున్న కుమారుడు, 320 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి రాగా, అప్పటికి ఇంకా ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాలేదు. 'బీబీసీ' వార్తా సంస్థ ప్రత్యేక కథనం ప్రకారం, మార్క్ క్లెమెంట్స్ అనే వ్యక్తి, తొలుత ఓ బస్, ఆపై రెండు రైళ్లు మారి లండన్ నుంచి డెవోన్ లోని తన తల్లి ఇంటికి చేరుకున్నాడు.

అంతకుముందు తనకు గాయమైందని, ఎముక విరిగిందని ఆమె చెప్పింది. దీంతో ఆదుర్దాగా, దాదాపు 320 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసి వచ్చాడు. అక్కడికి కేవలం 10 నిమిషాల ప్రయాణ సమయం పట్టేంత దూరంలో ఉన్న అంబులెన్స్ మాత్రం అక్కడికి ఇంకా రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ, ఏడు గంటల తరువాత తనకు మెడికల్ హెల్ప్ అందిందని మార్క్ తల్లి మార్గరెట్ (77) ఆరోపించారు. తాను వచ్చేసరికి ఆమె నేలపై పడిపోయి, కదల్లేని స్థితిలో కనిపించిందని, ఇంత ఘోరమైన పరిస్థితిలో అంబులెన్స్ వ్యవస్థ ఉందని తాను భావించలేదని మార్క్ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ ఘటనను బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. జరిగిన తప్పుకు తాము క్షమాపణలు చెబుతున్నామని సౌత్ వెస్ట్రన్ అంబులెన్స్ సర్వీసెస్ అధికారి ఒకరు తెలిపారు. అంబులెన్స్ లకు అనుకోకుండా డిమాండ్ పెరగడంతోనే ఇలా జరిగిందని, రోగి వద్దకు త్వరగా చేరుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం మార్క్ క్లెమెంట్ తల్లికి శస్త్రచికిత్స జరుగగా, ఆమె కోలుకుంటున్నారు.

  • Loading...

More Telugu News