Jayashankar Bhupalpally District: ఇంతకీ అమ్మవారికి సీఎం కేసీఆర్ సమర్పించిన పట్టుచీర ఏమైనట్టు?
- ఏడునెల క్రితం ఘటన వెలుగు చూసినా ఆచూకీ లేదు
- బాధ్యుల సస్పెన్షన్‌తో సరిపెట్టిన అధికారులు
- చీర దొరికిందీ లేనిదీ స్పష్టం చేయని వైనం
సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైనా, అందుకు బాధ్యులెవరు, పట్టుచీర ఎక్కడ ఉందన్న విషయం దేవాదాయ శాఖ అధికారులు ఏడు నెలలైనా తేల్చకలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శుభానందా దేవిని 2016 మే 2న సీఎం దంపతులు దర్శించుకుని విలువైన పట్టుచీర సమర్పించారు.
ఈ పట్టుచీర మాయమైన విషయం ఏడు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు ఇంటిదొంగలే ఈ చోరీకి పాల్పడ్డారని తేల్చారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావించి ఈఓలు హరిప్రకాష్, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్‌లతోపాటు ఆలయ అర్చకుడు కృష్ణమూర్తి శర్మను బాధ్యులుగా తేల్చారు. అర్చకుడికి షోకాజ్ నోటీసు అందజేసి ముగ్గురు అధికారులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు.
కానీ పట్టుచీర ఆచూకీ మాత్రం కనుగొనలేకపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి వారం రోజు క్రితం బాధ్యులైన వారికి రూ.6 వేల చొప్పున జరిమానా విధించి దర్యాప్తు ముగించినట్లు సమాచారం. సాక్షాత్తు సీఎం సమర్పించిన పట్టుచీరనే కనుక్కోలేకపోయారని దేవాదాయ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.