Sapna Chowdary: సప్నా చౌదరి డ్యాన్స్ కార్యక్రమంలో తొక్కిసలాట!
- రాజ్ గఢ్ లో సప్నా చౌదరి నృత్య కార్యక్రమం
- అంచనాలకు మించి వచ్చిన అభిమానులు
- పోలీసుల లాఠీ చార్జ్
సప్నా చౌదరి... దక్షిణ భారతావనికి ఈ పేరు పెద్దగా పరిచయం లేదుగానీ, ఉత్తర భారతదేశంలో మాత్రం కుర్రకారుకు నిద్రపట్టనీయదు. ఏ పెద్ద కార్యక్రమం జరిగినా ఆమె నృత్య కార్యక్రమం ఉండాల్సిందే. హర్యానాకు చెందిన సప్న స్వయంగా పాడుతూ చేసే డ్యాన్సులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె రాజ్ గఢ్ లో ఓ కార్యక్రమానికి హాజరైన వేళ, ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు రాగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి జరుగగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్టేజ్ పైకి సప్న రాగానే, తమ సీట్లపై నుంచి లేచిన అభిమానులు ముందుకు తోసుకు వచ్చారని, నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయని కారణంగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో కార్యక్రమం ప్రారంభం నుంచే వారిని అదుపు చేయడం కష్టమైందని, ఓ దశలో పోలీసులతో ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారని అన్నారు. పోలీసులపై రాళ్లు పడటంతో, ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
తొక్కిసలాట జరుగుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు, సప్నా చౌదరిని క్షేమంగా వేదికపై నుంచి దించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. కాగా, గత సంవత్సరం నవంబర్ లో బెగూసరాయ్ లో జరిగిన ఛాత్ పూజలో డ్యాన్స్ చేసేందుకు సప్న వచ్చిన వేళ కూడా ఇదే తరహా ఘటన జరుగగా, ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి.