Hyderabad: అక్షరాలా పది లక్షలు... భద్రంగా తెచ్చి పోలీసుల చేతుల్లో పెట్టిన ఆటో డ్రైవర్!
- ఓ ఆటో డ్రైవర్ నిజాయతీ
- ప్రయాణికులు మర్చిపోవడంతో స్టేషన్లో అప్పగింత
- అభినందించిన అధికారులు
రోడ్డుపై వంద రూపాయలు కనిపిస్తే అటూ ఇటూ చూసి ఎవరూ చూడడం లేదనుకుంటే తీసి జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది అక్షరాలా పది లక్షల రూపాయలున్న బ్యాగు చేతికి చిక్కినా ఆ ఆటో డ్రైవర్ ఆలోచన దారితప్పలేదు. తనది కాని దానికోసం ఆశపడడం ఎందుకని భావించి భద్రంగా ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించి తన నిజాయతీ నిరూపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన కొత్తూరి కృష్ణ, ప్రసాద్ సోదరులు. ఇంటి నిర్మాణం చేపడుతుండడంతో అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం పది లక్షల రూపాయలు సిద్ధిపేట నుంచి పట్టుకుని వచ్చారు. నగరానికి వచ్చాక జె.రమేష్ అనే ఆటోవాలా ఆటో ఎక్కారు. కొంతదూరం వెళ్లాక బ్యాగును ఆటోలోనే వదిలేసి దిగి వెళ్లిపోయారు.
అనంతరం బయలుదేరుతుండగా తన ఆటోలో బ్యాగును చూసిన రమేష్ దాన్ని తెరిచి చూడగా అందులో భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. తన ఆటోలో వచ్చిన వారు బ్యాగు మర్చిపోయారని గుర్తించి వారి కోసం వెతికాడు. కనిపించకపోవడంతో బ్యాగును భద్రంగా తీసుకువెళ్లి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాడు. అనంతరం పోలీసులు బ్యాగుకు చెందిన కృష్ణ, ప్రసాద్‌ను గుర్తించి వారికి సమాచారం అందించారు. వారు స్టేషన్‌కు వచ్చాక ఆటో డ్రైవర్ చేతులు మీదుగానే బ్యాగును వారికి అందించారు. డ్రైవర్ రమేష్ నిజాయతీని డీసీపీ వెంకటేశ్వరరావు, సిబ్బంది అభినందించారు.