Andhra Pradesh: ఏపీలోని 25 నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు తప్పదు.. వైసీపీ నేత సజ్జల సంచలన ప్రకటన!
- 150 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలే బరిలోకి
- మిగిలిన చోట్ల నాయకత్వ మార్పు తథ్యం
- ఒంగోలులో మీడియాతో వైసీపీ నేత
త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వైసీపీ సీనియర్ నేత, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు తప్పవని వ్యాఖ్యానించారు. ఏపీలోని 150 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న సమన్వయకర్తలే అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. అయితే మిగిలిన 25 స్థానాల్లో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించబోమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల సూచించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నమ్మించి మోసం చేశారన్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అలాంటి ఎత్తుగడ వేస్తున్నారని మండిపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.