Coastal bank: కోటి రూపాయలు కావాలంటూ మామయ్య ఫోన్ చేశారు.. ఆయన హత్యతో నాకు సంబంధం లేదు: శిఖా చౌదరి
- నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం
- ఆయన ఇంటికి వెళ్లింది నిజమే
- కానీ, భూమి పత్రాల కోసం కాదు
కోస్టల్ బ్యాంకు చైర్మన్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరి మీడియా ముందుకొచ్చింది. గురువారం రాత్రి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ఈ హత్యకేసులో తన ప్రమేయం లేదని, తనను కేంద్రంగా చేసుకుని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన చనిపోయారన్న షాక్ నుంచి తానింకా తేరుకోలేదని పేర్కొంది.
జనవరి 29న మామయ్య (జయరాం) తమ ఇంటికి వచ్చి భోజనం చేశారని, అనంతరం తాను చేపడుతున్న ప్రాజెక్టు కోసం ఇద్దరం చర్చించినట్టు చెప్పింది. ఆ తర్వాత తమ డ్రైవరే ఆయనను ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాడని తెలిపింది. అంతకుముందు తనకు పరిచయం చేసిన అమెరికా క్లయింట్ 30న మామయ్యకు ఫోన్ చేశారని, ఆ విషయాలు తనకు చెబుతూ ఆయన తనకు మెయిల్ చేశారని శిఖా వివరించింది.
అదే రోజు సాయంత్రం 4:20 గంటలకు మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని అడిగారని, 31న ఉదయం మరోమారు ఫోన్ చేసి ఎడ్జెస్ట్ అయ్యాయా? అని అడిగారని శిఖా తెలిపింది. అంత డబ్బు ఎందుకన్న ప్రశ్నకు ఒకరి దగ్గర రూ. 4 కోట్లు తీసుకున్నానని చెప్పారని పేర్కొంది. ఆ వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు గతంలో నీకు బాగా తెలిసిన వ్యక్తే అని చెప్పారని తెలిపింది. అయితే, ఎక్కడున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదని వివరించింది.
ఆ తర్వాతి రోజే మామయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అమ్మ చెప్పిందని గుర్తు చేసుకుంది. వచ్చే వారం విజయవాడ వెళ్తున్నట్టు మామయ్య తనతో చెప్పారని, బహుశా అక్కడికి వెళ్తుంటే ప్రమాదం జరిగిందని అనుకున్నానని, కానీ ఇంత జరిగిందని ఊహించలేకపోయానని పేర్కొంది.
తాను మామయ్య ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే అంతకుముందు ఆయన తీసుకెళ్లిన ప్రాజెక్టు ఫైల్ తీసుకొచ్చేందుకే వెళ్లానని, తనతోపాటు ఆ ఇంటి వాచ్మెన్ కూడా ఇంట్లోకి వచ్చారని శిఖా వివరించింది. భూమి పత్రాలు తీసుకునేందుకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధమని, హత్యతో తనకు ప్రమేయం ఉంటే అందరికీ తెలిసేలా ఆయన ఇంటికి ఎలా వెళ్తానని శిఖ వివరించింది.