Chigurupati Jayaram: ఆ విషయం మామయ్య చనిపోయాకే నాకు తెలిసింది: శిఖా చౌదరి
- కార్మికులతో సమస్య వచ్చినప్పుడు పరిష్కారానికి వచ్చాడు
- ప్రవర్తన నచ్చక 9 నెలలుగా దూరం పెట్టా
- డబ్బులు ఇవ్వకపోవడం వల్లే చంపేసి ఉంటాడు
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. జయరాం రూ.4 కోట్లు అప్పుగా తీసుకున్న రాకేశ్‌తో తనకు 2017లో పరిచయం అయిందని తెలిపింది. టెట్రాన్ కంపెనీలో కార్మికులతో సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించేందుకు వచ్చాడని, అప్పుడే అతడితో పరిచయం ఏర్పడిందని శిఖా పేర్కొంది.
అప్పటికి రాకేశ్ ఎవరో మామయ్య జయరాంకు తెలియదని పేర్కొంది. రాకేశ్ తరచూ తనకు ఫోన్ చేస్తుండడంతో అతడి ప్రవర్తన నచ్చక గత 9 నెలలుగా దూరం పెట్టానని తెలిపింది. ఓసారి మామయ్య కలిసినప్పుడు కూడా రాకేశ్ రెడ్డి గురించి చెప్పి అతడి ఫోన్ నంబరును తీసేయమని చెప్పానని శిఖ పేర్కొంది. మామయ్య అతడి దగ్గరే నాలుగు కోట్లు తీసుకున్నారన్న విషయం ఆయన చనిపోయాకే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. డబ్బులు ఇవ్వకపోవడం వల్లే రాకేశ్ ఈ హత్య చేశాడని భావిస్తున్నట్టు శిఖా చౌదరి తెలిపింది.