APIIC: నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏపీఐఐసీ భవనం ప్రారంభం.. మంగళగిరికే తలమానికం
- 2.26 ఎకరాల్లో 11 అంతస్తుల్లో భవనం
- పై మూడు అంతస్తులు ఏపీఐఐసీ కోసం
- కార్యాలయాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం
2.26 ఎకరాల విస్తీర్ణంలో రూ. 110 కోట్లతో మంగళగిరిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) బహుళ అంతస్తుల భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేటి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. 11 అంతస్తులున్న ఈ భవనంలో బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి.
పారిశ్రామిక, పెట్టుబడుల విభాగాల కార్యాలయాలన్నీ ఒకే భవనంలో ఏర్పాటు చేశారు. భవనంలోని రెండు సెల్లార్లను పార్కింగ్ కోసం కేటాయించారు. పై మూడు అంతస్తులను ఏపీఐఐసీకి, మిగతా తొమ్మిది అంతస్తులను పరిశ్రమలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు, మరికొన్నింటిని ఐటీ సంస్థలకు అద్దెకు ఇవ్వనున్నారు. ఫలితంగా మంగళగిరిలో ఐటీకి ప్రోత్సాహం లభించనుంది.
అత్యంత ఎత్తైన ఈ బహుళ అంతస్తుల టవర్ మంగళగిరికే ప్రత్యేక ఆకర్షణ కానుంది. కార్యాలయాలన్నీ ఒకే చోట కేంద్రకృతం కావడంతో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఒకే చోట మొత్తం సమాచారం లభ్యం కానుంది.