srikakulam: ‘సిక్కోలు’కు కళింగాంధ్ర ఉత్సవ శోభ... నేటి నుంచి కార్యక్రమాలు
- మూడు రోజుల పాటు వైభవం చాటేందుకు ఏర్పాట్లు
- ముందు రోజు శోభాయాత్ర నిర్వహణ
- అలరించిన సాంస్కృతిక సమ్మేళనం
కళింగాంధ్ర చారిత్రక వైభవాన్ని చాటేందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన మూడు రోజుల ‘కళింగాంధ్ర ఉత్సవాలు’ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, కోడి రామ్మూర్తి స్టేడియంలు ముస్తాబయ్యాయి.
మూడు రోజులపాటు ఒక చోట సాయంత్రం 4 గంటల నుంచి ప్రముఖ కళాకారులు, నటులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోచోట కళింగాంధ్ర చారిత్రక వైభవానికి ప్రతీకలు, జిల్లా కీర్తిప్రతిష్టను చాటే నమూనాలను ప్రదర్శించనున్నారు. జిల్లా సాంస్కృతిక వైభవం చాటేలా కోడి రామ్మూర్తి స్టేడియం ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. సభా వేదికకు ఇరువైపులా ప్రముఖ సూర్యదేవాలయం అరసవిల్లి సూర్యనారాయణమూర్తి, శ్రీముఖలింగం ఆలయాల నమూనాలతోపాటు జామియా మసీదు, చర్చి నమూనాలను ఏర్పాటు చేశారు.
జిల్లా చారిత్రక వైభవాన్ని భావితరాలకు తెలియజెప్పాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుంచి ప్రారంభించిన యాత్రలో భాగంగా ప్రదర్శించిన తప్పెటగుళ్లు, కోలాటం తదితర కార్యక్రమాలతో సంప్రదాయ కళా సాంస్కృతిక సమ్మేళనం అలరించింది. తొలిరోజు కార్యక్రమాలు ఈరోజు ఉదయం 10 గంటలకు కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు జిల్లా చారిత్రక వైభవాన్ని చాటే ఆడియో, వీడియోలను ప్రదర్శించనున్నారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు, వారు సేదదీరేందుకు వీలుగా కోడి రామ్మూర్తి స్టేడియంలో పలు రకాల స్టాల్స్ సిద్ధం చేశారు. ఈనెల 10వ తేదీతో ఉత్సవాలు ముగియనున్నాయి.