C.M.Ramesh: మీరు నిబంధనలు ఉల్లంఘించారు...ఖాతా నిలిపి వేస్తున్నాం: ఎంపీ సి.ఎం.రమేశ్ కు వాట్సాప్ సమాధానం
- గత కొన్నాళ్లుగా పనిచేయని ఖాతా
- సంస్థకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుడు
- కేంద్రమే బ్యాన్ చేయించిందని ఆరోపిస్తున్న రమేశ్
‘మీరు మా సంస్థ నియమ నిబంధనలు ఉల్లంఘించారు. మీపై చాలా ఫిర్యాదులు అందాయి. అందుకే మీ నంబర్‌కు వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నాం’...రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్ కు వాట్సాప్ సంస్థ అందించిన సమాచారం ఇది. టీడీపీ సీనియర్ నేత అయన రమేశ్ వాట్సాప్ ఖాతాను ఆ సంస్థ బ్యాన్ చేసిందని తాజాగా వెల్లడైంది.
ఇటీవల కాలంలో తన వాట్సాప్ ఖాతా పనిచేయక పోవడంతో సీఎం రమేశ్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సంస్థ ఈ విధంగా సమాచారం ఇచ్చింది. అయితే ఫిర్యాదుదారుని వివరాలు మాత్రం వాట్సాప్ నిర్వాహకులు బయటపెట్టలేదు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత కాపాడే చర్యల్లో భాగంగా ఆ వివరాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
కాగా, కేంద్ర ప్రభుత్వమే తన ఖాతాను బ్యాన్ చేయించిందని సి.ఎం.రమేశ్ ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగిన తర్వాత రోజురోజుకూ టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఇలాంటి సమయంలో రమేశ్ ఖాతా నిలిపి వేయడం చర్చనీయాంశంగా మారింది.