Telangana: వికారాబాద్ కలెక్టర్ పై ఎన్నికల సంఘం గుస్సా.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు!
- ఈవీఎంల పనితీరుపై హైకోర్టుకు కాంగ్రెస్ నేతలు
- అంతలోనే 100కుపైగా ఈవీఎంలకు సీల్ తీసిన కలెక్టర్
- నిబంధనలు ఉల్లంఘించడంతో సస్పెన్షన్ వేటు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లను నిబంధనలకు విరుద్ధంగా తెరిచినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈవీఎంల రిగ్గింగ్ వల్లే ఓడిపోయామని కొడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
కేసు కోర్టులో ఉండగానే బెంగళూరు నుంచి వచ్చిన బెల్ ఇంజనీర్లు ఆ నియోజకవర్గాలకు చెందిన 100కు పైగా ఈవీఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేయడంతో వివాదం ముదిరింది. కేసు కోర్టులో ఉండగానే ఈవీఎం సీల్స్ తీయడంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయడంలో భాగంగానే తనిఖీలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు.