Telangana: హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు
- హైదరాబాద్ నగర అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష
- నగరాన్ని మూడు యూనిట్లుగా విభజించాలి
- మూడు నెలల్లో బృహత్ ప్రణాళిక రూపొందించాలి
హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని మూడు యూనిట్లుగా విభజించి మూడు నెలల్లో బృహత్ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. బృహత్ ప్రణాళికలో మంత్రి వర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం చేస్తామని స్పష్టం చేశారు.
హెచ్ఎండీఏ, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో ప్రాథికార సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ నిధులపైనే ఆధారపడకుండా ఇతర నిధులు కూడా సమకూరుస్తామని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, బీజింగ్ వంటి నగరాలు ఇప్పుడు జన జీవనానికి అనువుగా లేవని, హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా జాగ్రత్త పడాలని సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్ స్వర్గంలా ఉండేదని, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేదని గుర్తుచేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వలస వస్తున్నారని, హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయని అన్నారు.