YSRCP: కేసీఆర్‌ను ఏమైనా అంటే తెలంగాణ సెంటిమెంట్ రగలిస్తున్నారు.. రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయో!: చంద్రబాబు
- కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌పై మరోమారు స్పందించిన బాబు
- ప్రతి ఒక్కరు ఆయనకు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న సీఎం
- వైసీపీ నేతలపై ఫైర్
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోమారు స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయనకు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ను ఏమన్నా అంటే తెలంగాణ సెంటిమెంట్ రగలిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిలో తన కృషి కూడా ఎంతో ఉందని, అటువంటి తనను కేసీఆర్ తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఐదారు నదుల్ని కలుపుతామన్నారు. రాజకీయాలు దారుణంగా తయారయ్యాయని, వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని, పార్లమెంటులో ఉండరని విమర్శించారు.