Satyajit Biswas: టీఎంసీ ఎమ్మెల్యే దారుణ హత్య.. పూజ చేసి వేదిక దిగి వస్తుండగా కాల్పులు

  • శనివారం రాత్రి ఘటన
  • పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు
  • బీజేపీ పనేనంటూ టీఎంసీ విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గతరాత్రి ఆయనపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.  

నదియా జిల్లా కృష్ణగంజ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యజిత్ శనివారం ఫుల్బరిలో జరిగిన సరస్వతి పూజలో పాల్గొన్నారు. అనంతరం వేదిక దిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు.  

సత్యజిత్ హత్యలో బీజేపీ పాత్ర ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. వారే ఈ హత్య చేయించారని, ఇటీవలే వివాహమైన అతడిని పొట్టనపెట్టుకోవడం దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్ దత్తా కన్నీరు పెట్టుకున్నారు. సత్యజిత్ హత్యను తేలిగ్గా తీసుకోబోమని హెచ్చరించారు.

టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రతీ దానిని బీజేపీతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. ఈ హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు నదియా ఎస్పీ రూపేశ్ కుమార్ తెలిపారు. వారి నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 

  • Loading...

More Telugu News