Andhra Pradesh: దమ్ము ఏంటి?.. విజయవాడకు రా.. తిరిగి వెళతావేమో చూద్దాం!: జీవీఎల్ కు నటుడు శివాజీ ఘాటు వార్నింగ్
- మోదీ దరిద్రపు కాలును ఏపీలో పెట్టారు
- బీజేపీ సభలో వేరే పార్టీ కార్యకర్తలు ఉన్నారు
- ఈరోజు మోదీ గ్యాస్-ఆయిల్ తెచ్చారు
మోదీ దరిద్రపు కాలును ఏపీలో పెట్టారు కాబట్టే తాను కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నానని ప్రముఖ సినీనటుడు శివాజీ తెలిపారు. ఈ రాజకీయ తీవ్రవాదిని దేశం నుంచి బహిష్కరించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. రాఫెల్ కుంభకోణం, రైతుల ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మోదీ తినేశారని ఆరోపించారు. మోదీ టూర్ ను అడ్డుకుంటే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని బీజేపీ నేత జీవీఎల్ చెప్పడాన్ని శివాజీ తప్పుపట్టారు.
మోదీ పర్యటనను అడ్డుకుంటే ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని సోదరుడు జీవీఎల్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీవీఎల్ కు చాలా మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడాలంటే ఆయనకు దడ. లోపల బీపీ, షుగర్ అన్నీ ఉన్నట్లు ఉన్నాయి. ఏదో సొల్లు చెబుతూ ఉంటాడు. దమ్ముందా? అని అడుగుతుంటాడు. దమ్మేంటి?.. రా.. ఇక్కడకు (విజయవాడకు) రా.. నేనొక్కడినే వస్తా.. నువ్వు తిరిగి వెళతావేమో చూద్దాం’ అని హెచ్చరించారు.
బీజేపీ సభకు ఈరోజు వెళ్లినవారిలో వేరే పార్టీ కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. మోదీ రాక నేపథ్యంలో జనసేన, వైసీపీల నిరసన ఎక్కడుందని ప్రశ్నించారు. గతంలో మట్టి-కుండ తెచ్చిన మోదీ ఈసారి ఆయిల్, గ్యాస్ తెస్తారని సెటైర్ వేశారు. ఏపీ ప్రజలకు ఆయిల్ పూసి ఇక్కడి గ్యాస్ ను తీసుకెళ్లడానికే మోదీ వచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడులో సినిమా నటులతో పార్టీలు పెట్టించిన మోదీ, కేరళలో శబరిమల ఆలయం విషయంలో ఘర్షణలు రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. ఈ పార్టీలన్నీ నరేంద్ర మోదీకి బానిసలేనని స్పష్టం చేశారు.