Andhra Pradesh: చంద్రబాబు భాష సరిగ్గా లేదు.. డిక్షనరీలో ఉన్న అన్ని తిట్లను ఆయన నాకోసం రిజర్వు చేశారు!: మోదీ ఆగ్రహం
- టీడీపీ నేతలు గో బ్యాక్ అంటున్నారు
- అలాగే మళ్లీ ప్రధాని పదవిలోకి వెళ్లి కూర్చుంటా
- పోలవరం, అమరావతిలో బాబు సంపద సృష్టిస్తున్నారు
సాధారణంగా టీచర్లు క్లాసులో విద్యార్థులను పిలిచి, ఏదైనా బోర్డుపై రాయాలని చెబుతారనీ, ఆ తర్వాత గో బ్యాక్ (వెళ్లి కూర్చో) అనేవారని, ఇప్పుడు టీడీపీ నేతలు తనను ఢిల్లీకి వెళ్లి ప్రధాని కుర్చీపై మరోసారి కూర్చోవాలని ‘గో బ్యాక్’ అని చెబుతున్నారని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇందుకోసం టీడీపీ నేతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని కోట్లాది మంది భారతీయులు తనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకునే పనిలోనే బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ’లో మోదీ మాట్లాడారు.
తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు మహాకూటమిలో చేరారని తెలిపారు. మహాకూటమిలోని ప్రతీఒక్కరిపై దేశాన్ని మోసం చేసిన కేసులు ఉన్నాయని అన్నారు. ‘నాకు సంపద సృష్టించడం రాదనీ, తనకు మాత్రమే సంపద సృష్టి తెలుసని చంద్రబాబు చెప్పినట్లు పేపర్ లో చదివాను. అవును ఆయన చెప్పింది నిజమే. చందబ్రాబుకు సంపద సృష్టించడం బాగా తెలుసు. అమరావతి నుంచి పోలవరం వరకూ తన కోసం సంపద సృష్టించుకోవడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఈ కాపలాదారు (మోదీ) అంటే భయం వేస్తోంది’ అని ప్రధాని దుయ్యబట్టారు.
ఏపీ సంస్కారం చాలా గొప్పదనీ, కానీ చంద్రబాబు వాడుతున్న భాష సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఒక కొత్త దూషణ చొప్పున.. డిక్షనరీలో ఉన్న తిట్లు అన్నింటిని చంద్రబాబు తనకోసం రిజర్వు చేశారని మండిపడ్డారు. దేశం కోసం సంపద సృష్టించడం కోసమే ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారనీ, సొంత ధనార్జన కోసం కాదని హితవు పలికారు.
యువత, మహిళలు, రైతులు సంపదను సృష్టించే పనిచేస్తున్నారనీ, వారికి పారదర్శకమైన వ్యవస్థ నిర్మించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యతని ప్రధాని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుందనీ, కేవలం తన కుమారుడు, కుమార్తెకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. గత 55 నెలల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుందని మోదీ స్పష్టం చేశారు. ఏపీకి కేటాయించిన పలు విద్యా సంస్థలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రధాని గుర్తుచేశారు.