NTR: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబే!: తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
- ఎన్టీఆర్‌కు భారతరత్న విషయంలో డ్రామా నడుస్తోంది
- పురస్కారం ఇప్పించడం చంద్రబాబుకు పెద్ద పనేం కాదు
- కావాలనే దానిని అడ్డుకుంటున్నారు
ప్రముఖ దర్శకనిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ చేస్తున్న చంద్రబాబే దానిని అడ్డుకుంటున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొంటూ తనకు వచ్చిన అనుమానం వెనక ఉన్న అంశాలను విశ్లేషించారు.
‘నా ఆలోచన’ అనే యూట్యూబ్ చానల్‌లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున ప్రకటించిన పురస్కారాల్లో ఎన్టీరామారావు పేరు లేకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని, కానీ ఎందుకో ఈ విషయంలో తనకు ఆయనపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబుకు భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
అయితే, అవార్డులు ప్రకటించేంత వరకు సైలెంట్‌గా ఉండి, ఆ తర్వాత హడావుడి చెయ్యడం వెనక పెద్ద స్టోరీనే ఉందని అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే కుటుంబం మొత్తం వెళ్లాలని, ఆయన భార్యగా ఉన్న లక్ష్మీపార్వతి అవార్డును అందుకోవాల్సి ఉంటుందని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఆ పురస్కారాన్ని లక్ష్మీపార్వతి అందుకోవడం వీరికి ఇష్టం లేదని, అందుకనే కావాలనే జాప్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు.
భారతరత్న వద్దనుకుంటే దానిని అక్కడితో వదిలేయాలి కానీ ఈ రాద్ధాంతం ఎందుకని భరద్వాజ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చాలామంది బతుకుతున్నారని, కాబట్టి ఆయనను భ్రష్టుపట్టించవద్దని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.