weather: తెలుగు రాష్ట్రాల్లో అటూ...ఇటూ మారుతున్న ఉష్ణోగ్రతలు!

  • చలి, ఎండ, వర్షం దోబూచులాట
  • తగ్గుముఖం పట్టిన ఉపరితల ద్రోణి ప్రభావం
  • పగటి ఉష్ణోగ్రతలు క్రమేపి పెరిగే అవకాశం
మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అటూ...ఇటూ అన్నట్లు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత కూడా వణికించే చలి రెండు రోజుల క్రితం హఠాత్తుగా తగ్గింది. మళ్లీ ఆదివారం నాటికి మార్పు కనిపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావం కారణంగా రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా అవకాశం లేకుండా పోయింది. కడప జిల్లా రాజంపేటలో మాత్రమే ఒక సెంటిమీటరు వర్షపాతం నమోదయింది.

ప్రస్తుతం ద్రోణి ప్రభావం కూడా బలహీనపడిందని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం వరకు రెండు రాష్ట్రాల్లో చలి వణికించింది. పగటి ఉష్ణోగ్రతల్లో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల నమోదయింది. శనివారం నుంచి రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయల సీమలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు, కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రానికి మళ్లీ చలిగాలులు మొదలయ్యాయి. ముందురోజు కంటే పగటి ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యాయి. ఆదివారం ఆంధ్ర రాష్ట్రంలో జంగమహేశ్వరపురంలో ముందు రోజుతో పోల్చితే నాలుగు డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో ఒకటి రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చునని, ఆ తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
weather
up and downs
heat waves

More Telugu News