Maharashtra: ఇవే ఈవీఎంలు వాడితే బ్రిటన్, అమెరికాల్లోనూ కమల వికాసం: శివసేన వ్యంగ్యం
- బీజేపీని టార్గెట్ చేసిన శివసేన
- రామమందిరం సంగతి ఏమైంది?
- మహారాష్ట్ర ప్రజలు పునరాలోచించుకుంటున్నారు
- 'సామ్నా' సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు
ఇండియాలో వాడుతున్న ఈవీఎంలనే వాడుతూ ఎన్నికలు పెడితే బ్రిటన్, అమెరికాల్లోనూ కమలం వికసిస్తుందని శివసేన ఎద్దేవా చేసింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండే శివసేన, తాజాగా తమ అధికార 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ త్వరలోనే కనుమరుగై, అసలు నిజం తెలిసివస్తుందని అభిప్రాయపడింది. ఇవే ఈవీఎంలను వాడుతూ ఎన్నికలు జరిపితే ఎక్కడైనా బీజేపీ విజయం సాధిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సందించింది.
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించిన పత్రిక, ఈ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 43 గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, రానున్న ఎన్నికల్లో ఈ నంబర్ ఎంత తగ్గుతుందో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొందని, బీజేపీకి కష్టకాలం ముందుందని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులు, ఇప్పుడు పునరాలోచించుకుంటున్నారని పేర్కొంది.
రాష్ట్రంలోని సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. లేకుంటే ఇప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవారంతా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.