India: దేశంలో కులవివక్షను రూపుమాపాలి.. ఎవరైనా కులం పేరెత్తితే కొడతా!: కేంద్ర మంత్రి గడ్కరీ
- ఎన్ని కులాలు ఉన్నాయో నాకు తెలియదు
- కుల, వర్గరహిత సమాజానికి కృషి చేయాలి
- సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న గడ్కరీ
సొంత ప్రభుత్వంపైనే పరోక్ష విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పందించారు. భారత్ లో కుల వివక్షను రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో గడ్కరీ మాట్లాడారు.
ఈ సందర్భంగా గడ్కరీ స్పందిస్తూ ఎవరైనా కులం గురించి మాట్లాడితే కొడతానని తాను గతంలో హెచ్చరించానని తెలిపారు. అందుకే తన లోక్ సభ స్థానమైన నాగ్ పూర్ లో ఎవరూ కులం గురించి మాట్లాడరని అన్నారు. గతంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అనితర సాధ్యమైన హామీలు ఇచ్చే నేతలను ప్రజలు తిరస్కరిస్తారని గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.