AIR INDIA EXPRESS: విమానంలో ఒక్కసారిగా పడిపోయిన పీడనం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం!
- ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ లో ఘటన
- మస్కట్ నుంచి కాలికట్ కు బయల్దేరిన విమానం
- ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో చికిత్స
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమానం ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా పీడనం తగ్గిపోవడంతో ప్రయాణికుల ముక్కు నుంచి రక్తస్రావం మొదలయింది. చాలామంది చెవినొప్పితో అల్లాడారు. మస్కట్ నుంచి కాలికట్ కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
185 మంది ప్రయాణికులు, సిబ్బందితో నిన్న ఎయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం బయలుదేరింది. అంతలోనే విమానం క్యాబిన్ లో ఒక్కసారిగా పీడనం తగ్గిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరికి ముక్కు నుంచి రక్తస్రావం కాగా, మరికొందరు చెవి నొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో అధికారులు వెంటనే విమానాన్ని మస్కట్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. అక్కడే బాధితులకు చికిత్స అందజేశారు. వారందరూ కోలుకున్నాక విమానం బయలుదేరింది.