Telangana: 17న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు!
- కేసీఆర్ పై రెండు పాటల విడుదల
- మీడియాకు వివరాలు తెలిపిన మాజీ మంత్రి తలసాని
- చీరల పంపిణీ కార్యక్రమానికి కవిత వస్తారని వెల్లడి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇక్కడి ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయుష్ హోమం, చండీ హోమం, గణపతి హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి పూజలు మొదలవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తలసాని ఈరోజు పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జలవిహార్లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హమాలీ బస్తీలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై రూపొందించిన రెండు పాటలను విడుదల చేస్తామన్నారు.
అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జరిగే చీరల పంపిణీ కార్యక్రమానికి నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కవిత హాజరవుతారని పేర్కొన్నారు.