Telangana: సొంత పార్టీకి ద్రోహం చేసినవాళ్లు.. ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు!: తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక
- పార్టీ నేతలను ఓడించినవారికి అధోగతే
- ప్రజాసేవ చేసేవారిని గౌరవించాలి
- ఖమ్మం టీఆర్ఎస్ సర్పంచుల సన్మాన సభలో మాజీ మంత్రి ఆగ్రహం
గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి ఆయనపై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సర్పంచుల సన్మాన సభలో తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి ద్రోహం చేసేవారు ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండలేరని తుమ్మల నాగేశ్వరరావు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సొంత నేతలను ఓడించామని రాక్షసానందానికి లోనవుతున్నవారు అధోగతి పాలవుతారని హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవారిని గౌరవించాలని అభిప్రాయపడ్డారు.
తాత్కాలిక మెరుపులు ఆశించేవారికి భవిష్యత్ ఉండదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతల తప్పుల వల్లే ఖమ్మం జిల్లాలో నష్టపోయామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగానే తుమ్మల విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.