Chandrababu: పోరాడి సాధించుకుందాం.. ప్రాణాలు పోగొట్టుకోవద్దు: ఢిల్లీలో శ్రీకాకుళం వాసి మృతిపై చంద్రబాబు
- శ్రీకాకుళం వాసి మృతి మనసును కలచివేసింది
- మృతుడు.. దివ్వల అర్జునరావుగా గుర్తింపు
- సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఢిల్లీలోని ధర్మ పోరాట దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన శ్రీకాకుళం వాసి ఆత్మహత్య చేసుకోవడం తన మనసును కలచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడి మన హక్కులను సాధించుకుందామని.. ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలను అనాథలను చేయవద్దని చంద్రబాబు సూచించారు. ఢిల్లీ పోలీసులు మృతుడి జేబులో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారని.. ఆ లేఖకు సంబంధించిన వివరాలను పోలీసులు తమకు ఇంకా ఇవ్వలేదని సీఎం తెలిపారు.
మృతుడిని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన దివ్వల అర్జునరావు (40)గా గుర్తించామన్నారు. అర్జునరావు కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా నేతలంతా వేదికపై రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఒక న్యాయవాది ఆత్మహత్యకు యత్నించారని.. ఆయనకు ధైర్యం చెప్పాలని అధికారులను ఆయన వద్దకు పంపించినట్టు సీఎం తెలిపారు.